జిల్లాలో ఆయిల్ పామ్ సీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు

Thummala Nageswara Rao

  • దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందం
  • ఇది దేశంలోనే మొదటి ఆయిల్ పామ్ సీడ్ ఫ్యాక్టరీ
  • భూ సేకరణకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలి
  • ప్రయోగాత్మకంగా నేనే ఒక్క సాగు చేస్తున్నా
  • సక్సస్ అయితే సాగు విస్తరణకు చర్యలు
  • రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ఒక ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా సీడ్ ఫ్యాక్టరీ లేదని, మనదగ్గరే దీన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎటువంటి నష్టం లేకుండా, ఇందుకు అవసరమైన భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం ఆయన కొణిజెర్ల మండలంలోని అంజనాపురంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పామాయిల్ ఫ్యాక్టరీని నవంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆ దిశగా పనులు పూర్తి చేయాలని అన్నారు.  రిఫైనరీ పనులు కూడా స్థానికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీ త్వరగా ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వానికి, రైతులకు ఆదాయం అధికంగా వస్తుందన్నారు. మన దగ్గర రెండు, మూడు ఎకరాలలో పామాయిల్ పంట సాగు చేస్తే, మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తే వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ వస్తుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పామాయిల్ దిగుబడి పెరిగేలా చూడాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని,  ఆయిల్ పామ్ పంట సాగు చేయడం వల్ల వచ్చే లాభాలను రైతులకు వివరిస్తూ పంట విస్తీర్ణం పెరిగేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటే సమయంలో గుంతలు 2 ఫీట్ల వరకు తవ్వాలన్నారు. నర్సరీ నుండి నాణ్యమైన మొక్కలను మాత్రమే రైతులకు అందించాలని, నర్సరీలో ఉన్న లోపాలను పూర్తి స్థాయిలో సరిదిద్దాలని, పామాయిల్ మొక్కల నాణ్యతను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. మన దగ్గర పొలాల్లో వక్క తోటలు పండించడానికి ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం తాను వక్క తోట సాగు చేస్తున్నానని, ఈ సాగులో 60 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుందని తెలిపారు. తన సాగు బాగా జరిగితే, ఈ పంట విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.

Oil Palms

రైతులు నమ్మకంతో సాగు చేస్తున్నారు ... నష్టం రావోద్దు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ రైతులు నమ్మకంతో పామాయిల్ పంట సాగు చేస్తున్నారని, వారికి నాణ్యమైన మొక్కలు అందించి నష్ట పోకుండా చూసుకోవాలనిఅధికార్లను కోరారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఫ్యాక్టరీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన సహాయ, సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామనితెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, కొణిజర్ల మండల తహసీల్దార్ అరుణ, శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.వి. ప్రసాద్, అగ్రి హార్టికల్చర్ సొసైటీ సలహాదారు నల్లమల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

MLA Ramdas Naik

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి